వినోదాల విళంబి

updated: March 20, 2018 11:36 IST
వినోదాల విళంబి

అది శ్రీ విళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం, పాడ్యమి నాటి సాయంత్రం ఉగాది వేడుకకు వేదిక సిద్దార్థ నగర్ (నార్త్) వెల్ఫేర్ అసోసియేషన్ వారి పార్కు. సమయం సరిగ్గా ఆరు గంటలు. ఆ ఆహ్లాద వాతావరణంలో రెండు వందల కుర్చీలు నిమిషాల్లో నిండిపోయాయి. స్థానిక పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు వేదికనలకరించి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం చేశారు. రాశి ఫలాలను వెల్లడించారు. ఏడుంపావుకు సాహిత్య సంగీత సమాఖ్య అధ్యక్షులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ రావికొండలరావు వేదికమీదకు వచ్చి సభికులకు విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, ‘వినోదాల విళంబి’ పేరుతో విశాఖపట్నం హ్యూమర్ క్లబ్ వారిచే ప్రదర్శింపబోయే ‘లఘు ప్రహసనాల’ నేపథ్యాన్ని వివరిస్తూ, కడుపుబ్బ నవ్వించే ఆ క్లబ్ సభ్యులను సభికులకు పరిచయం చేశారు.

 

హ్యూమర్ క్లబ్ అధ్యక్షులు శ్రీ రావి గోపికృష్ణ మాట్లాడుతూ, 2000 లో ‘విశాఖ హ్యూమర్ క్లబ్’ ను శ్రీ రావి కొండలరావు గారు ప్రారంభించారని. పద్దెనిమిదేళ్ళుగా ఈ సంస్థ దేశవ్యాప్తంగా కొన్ని వేల వినోద ప్రదర్శనలు ఇచ్చిందని, విశాఖ నగరంలో ప్రతి నెలా రెండవ ఆదివారం ఈ నవ్వుల వేడుకను క్రమంతప్పకుండా జరుపుతున్నామని తెలియజేశారు. ఈ బృందంలో శ్రీ రామానుజం, శ్రీ చిదంబరం, శ్రీ భానుప్రకాష్, శ్రీమతి శివజ్యోతి తోబాటు కుమారి కృష్ణవేణి శఠకోపన్ కూడా కలిసి శ్రీ కొండలరావు పర్యవేక్షణలో  లఘు ప్రహసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక యువకుడు అలర్జీ వైద్యునిపుణుని సలహాకోసం ఆసుపత్రికి వచ్చి నిరీక్షిస్తూ దినపత్రిక తిరగేస్తున్నాడు. అంతలో ఒంటికి పట్టిన తీటను వదిలించుకునేందుకు ఒక పేషంటు వచ్చి ఆ యువకుని ప్రక్కనే ఆసీనుడయ్యాడు. ఒళ్లంతా విపరీతంగా గోక్కుంటున్నాడు. ఆ దురదలు యువకునికి వంటబట్టాయి. ఇంకేముంది గోక్కోవడం ఆ యువకునివంతు.... అలర్జీ తగ్గిపోవడం పేషెంటు వంతయింది. పేషంటు నిష్క్రమణతో ఎక్కిళ్ళు పెడుతూ ఒక మహిళ వచ్చి ఆ యువకుని ప్రక్కన కూర్చుంది. దురదలతోబాటు ఆయువకునికి ఎక్కిళ్ళు కూడా వంటబట్టాయి. మహిళకు రిలీఫ్ వచ్చి వెళ్ళిపోయింది. మరో పేషంటు ఉక్కిరిబిక్కిరిగా దగ్గుతూ వచ్చి ఆ దగ్గును యువకునికి అంటించి రిలీఫ్ తో వెళ్ళిపోయాడు. ఇక చూసుకోండి ఆ యువకుని పరిస్థితి. అటు ఒళ్ళంతా దురదలు, ఎక్కుళ్ళు, దగ్గుతో శివతాండవం చేస్తున్నాడు. ప్రహసనం కట్ అయ్యింది. సభికుల నవ్వులతో చప్పట్లు మిన్నుముట్టాయి. ఒక అపార్టుమెంటులో ఎదురెదురు బాల్కనీలు. ఒక ముసలాయన మరో యువకుణ్ణి కోర్చోబెట్టుకుని పాటలు పాడిస్తున్నాడు. ‘ఉన్నావా అసలున్నావా’, ‘ఓ దేవా మొరవినవా’ వంటి పాటలు. పాట అవగానే ముసలాయన బయటకు వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. రెండుచేతులతో ‘ఉహూ’ అంటాడు. మరలా యువకుడు పాట ఎత్తు కుంటాడు. ఎదురింటి బాల్కనీలో వున్నాయనకు నిజం తెలుస్తుంది. ఎవరో ముసలాయనకు పాటపాడితే రాళ్ళు కరుగుతాయని చెప్పారట. ఆ ముసలాయనకు కిడ్నీలో రాళ్లున్నాయి. పాట పూర్తవగానే బయటకు వెళ్లి కిడ్నీస్కానింగ్ చేయించుకుని వస్తాడు. రాళ్ళు కరగలేదని మళ్ళీ పాడమంటాడు. ఇదీ ప్రహసనం. ఇలా ఎన్ని లఘు ప్రహసనాలో లెఖ్ఖ పెట్టలేం. ఈ హ్యూమరధం తొమ్మిది గంటలదాకా జరిగింది. పొట్టలు చెక్కలయ్యేలా నవ్వులు పూయించారు హ్యూమర్ క్లబ్ సభ్యులు. శ్రీ పోలిశెట్టి నాగేశ్వరరావు కూతురు చిరంజీవి మౌనిక ‘ముకుందా ముకుందా’ పాటపాడి సభికులనుంచి హర్షధ్వానాలు అందుకుంది. తరవాత వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సురేంద్రబాబు కాలనీలో వుండే ఇద్దరు సీనియర్ సిటిజన్లను సన్మానించారు. అలాగే సిద్దార్థ నగర్, కార్పొరేటర్ శ్రీ కిలారి మనోహర్ ను కూడా సముచిత రీతిలో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని కుమారి కృష్ణవేణి శఠకోపన్ ఎంతో హృద్యంగా, హాస్యరసస్పోరకంగా, హుందాగా, అంతే అందంగా నిర్వహించి సభికుల అభిమానం చూరగొంది. అనంతరం చిత్రాన్నాల్లతో చక్కటి విందును వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు. కడుపుబ్బగా నవ్వగా ఖర్చైన కేలరీలతో ఆకలి దంచేస్తుండగా పసందైన చిత్రాన్నాలు కడుపులు నింపాయి. ఆకలి నిండిన కడుపులతో, నవ్వులు నింపిన ప్రహసనాలను పునశ్చరణ చేసుకుంటూ సభికులంతా వాహనాల్లో ఇళ్ళకు బయలుదేరారు..... విళంబి ని నవ్వులతో స్వాగతిస్తూ.
.... ఆచారం షణ్ముఖాచారి

comments